jump to navigation

చంద్రబాబు “ఊద్‌” ముబారక్‌ జూన్ 19, 2007

Posted by ~Sri~ in Telangana.
trackback

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే, ముఖ్యమంత్రి పదవిని దళితుడికి, ఉప ముఖ్యమంత్రి పదవిని ముస్లింకు ఇస్తామని తెరాస అధినేత కేసీఆర్‌ ప్రకటించారు. మంత్రివర్గంలో ఐదారుగురు ముస్లిం వర్గీయులకు అవకాశం కల్పిస్తామన్నారు. సోమవారం రాత్రి హైదరాబాద్‌ పాతబస్తీ కిషన్‌బాగ్‌లో తెరాస కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. ముస్లింలు అధిక సంఖ్యలో హాజరైన ఈ సభలో కేసీఆర్‌ ఉర్దూలో మాట్లాడారు.

మధ్య మధ్యలో ఛలోక్తులతో ఆకట్టుకున్నారు. ‘ఫాలూస్‌ బన్‌కే జిస్‌కీ హిఫాజత్‌ ఖుదాకరే.. వో షమ్మా క్యా బుజే జిసే రోషన్‌ ఖుదా ఖరే’ (దేవుడు వెలిగించిన దీపాన్ని ఎవరూ ఆర్పలేరు.. చివరకు గాలైనా) అంటూ ఆయన చెప్పిన ఉర్దూ షేర్‌కు సభా ప్రాంగణం చప్పట్లతోమారుమోగింది. ముస్లింలకు విద్యా, ఉద్యోగ రంగాలలో 12 శాతం రిజర్వేషన్లను కల్పిస్తామని కేసీఆర్‌ హామీ ఇచ్చారు. ”అసఫ్‌జాహీ నిజాంల పాలనలో తెలంగాణ బంగారు పక్షి లాంటిది. నిజాం రాజ్యంలో ప్రభుత్వానికి హిందూ ముస్లింలు రెండు కళ్లుగా ఉండేవారు. కులీకుత్‌బ్‌షా నుంచి అసఫ్‌జాహీల వరకు 450 ఏళ్ల పాలనలో, ఏనాడూ మత కలహాలు జరగలేదు. రెండు మతస్థులు కలసిమెలసి జీవించారు” అని ఆయన అన్నారు. ”రాష్ట్రంలోని పలు ప్రభుత్వ శాఖల్లో ముస్లిం ఉద్యోగుల సంఖ్య తగ్గిపోతోంది. ప్రత్యేక రాష్ట్రం ఉంటే ఇలా జరిగేదా? ఇక్కడ ముస్లింలు నవాబులుగా జీవించారు, ఆంధ్రలో కల్సిపోయి బికారులుగా మారారు” అని పేర్కొన్నారు. ”ప్రభుత్వ కార్యాలయాలు, వ్యాపారాలు, సినీ పరిశ్రమ… ఎక్కడ చూసినా ఆంధ్రా వారే కన్పిస్తున్నారు. ఒకనాడు బంజారాహిల్స్‌లో నవాబులకు పెద్ద పెద్ద బంగాళాలు ఉండేవి. ఇప్పుడు అక్కడ నకిలీ ఆంధ్రా నవాబులు వచ్చారు. గతంలో పాతనగరంలోని పత్తర్‌గట్టీలో ముస్లింలు వస్త్ర వ్యాపారం చేసే వారు. ఇప్పుడు వారి స్థానంలో రాజమండ్రి, గుంటూరు తదితర ప్రాంతాల నుంచి వచ్చిన చందన బ్రదర్స్‌, బొమ్మన బ్రదర్స్‌ వంటి వారి పేర్లు కనబడుతున్నాయి. ఇక్కడి సిరిసిల్ల, భువనగిరి, భూదాన్‌ పోచంపల్లిల్లోని చేనేత కార్మికులు ఆకలి చావులు చస్తున్నారు” అని ఆయన వివరించారు. ” పాతబస్తీలో జనం ఫుట్‌పాత్‌లపై ఎందుకు పడుకుంటున్నారు? వారికి ఎందుకు ఇళ్లు ఇవ్వడం లేదు? వాళ్లు పన్నులు కట్టడం లేదా?తెలంగాణ ఏర్పడితే ముస్లింలలో ఒక మెరుపు వస్తుంది. రంజాన్‌, దసరా పండుగలను హిందూ ముస్లింలు కలసి జరుపుకొంటారు” అని చెప్పారు. ”నా చిన్నతనంలో ముస్లీంలు ఐదుసార్లు నమాజు చేసేవారు. వారు మా ఇంటికి వస్తే నమాజుకు ఏర్పాట్లు చేసేవాళ్లం. ఇక్కడి సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు ఆంధ్రా వాళ్లు తెల్సుకోలేరు. ఇవేవీ వాళ్లకు తెలియవు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నప్పుడు, ఆయనతో కలసి ఒకసారి నిజామాబాద్‌కు వెళ్లాను. రంజాన్‌ కావడంతో సాయంత్రం చాలా మంది ముస్లింలు వచ్చారు. ఈద్‌ ముబారక్‌ (రంజాన్‌ శుభాకాంక్షలు) అని చెప్పమంటే, ఆయన ‘ఊద్‌’ ముబారక్‌ అని చెప్పారు. అలాంటి వాళ్లు మనకు ఏమి చేస్తారు” అని ఆయన విమర్శించారు. ”పాతబస్తీలో మన పరిస్థితి, జీవనం ఏ విధంగా ఉందో చూస్తున్నారుగా? విద్యుత్‌ మీటర్లు తొలగించి ఏ విధంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారో తెలుసుగా? తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మీ కష్టాలు తీరుతాయి. నేను ప్రాణ త్యాగం చేసైనా ప్రత్యేక రాష్ట్రాన్ని సాధిస్తా”అని ఉద్ఘాటించారు.

వ్యాఖ్యలు»

No comments yet — be the first.