jump to navigation

తెలంగాన తెలుగు జూన్ 20, 2007

Posted by ~Sri~ in Telangana.
trackback

పోంగచిక్కినోడు

తెలంగాణా గ్రామీణ ప్రాంతాల్లో వినిపించే జాతీయమిది. మొండివాడు ఎవరికీ తల వంచనివాడు లాంటి అర్థాలలో ఇది ప్రయోగంలో కనిపిస్తుంది. ఇది పూర్వకాల సామాజిక పరిస్థితుల నేపథ్యం నుంచి అందులోనూ మసూచి, కలరా వంటి భయంకర వ్యాధులు సోకినప్పుటి సమయాల నేపథ్యంలో నుంచి ఆవిర్భవించింది. అలాంటి వ్యాధులు వ్యాపించినప్పుడు పూర్వం గ్రామాల్లో చాలామంది మరణిస్తూ ఉండేవారు. కొంతమంది పొరుగు గ్రామాల్లోని తమ బంధువుల దగ్గరకు వెళ్ళిపోయేవారు. కానీ ఏ ఒక్కరో, ఇద్దరో ఆ గ్రామాన్ని విడిచి పెట్టకుండా ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా ఉండి బతికి బయటపడేవారు. రోగాల కారణంగా గ్రామం అంతా ఖాళీ అయిపోతే మిగిలిన ఆ ఒక్కడే గ్రామానికి తిరుగులేని పెద్దగా ఆ తరువాత ఉంటూ ఉండేవాడు. అలాగే ఎవరైనా మొండి చేసి పరిస్థితులను ఎదుర్కొని నిలబడిన సందర్భంలో ”వాడు పోంగచిక్కినోడు వాడితో మనం గెలవలేం” లాంటి సందర్భాలలో ఈ జాతీయం ప్రయోగం కనిపిస్తుంది.


బాకాలు

నుకూల ప్రచార సాధనాలు, అనుకూలంగా మాట్లాడేవారు అనే అర్థాలలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. పూర్వ కాలపునాటి రాచరిక వ్యవస్థలో రాజు వచ్చేటప్పుడు మంగళ వాయిద్యాలను మోగిస్తూ, బాకాలను ఊదుతూ అనుకూలంగా స్తుతులు చేస్తూ ఉండేవారు. అవన్నీ ఆ రాజుగారి గొప్పతనానికి సూచికలుగా ఉండేవి. అదే తీరులో ఓ వ్యక్తి గురించి, ఓ సంస్థ రాజకీయ పక్షం ఇలా దేని గురించైనా పదేపదే ప్రచారం చేస్తున్నట్లు మాట్లాడుతున్నప్పుడు ”వీడు ఆయన గురించి తెగ బాకా ఊదుతున్నాడు. అందులో వాస్తవం లేదు” అనే లాంటి సందర్భాలలో ఈ జాతీయం ప్రయోగం కనిపిస్తుంది.


క్షణం గుణం

తెలంగాణా ప్రాంతంలో వినిపించే ఈ జాతీయం కాస్తంత ఓపిక పడితే అంతా సక్రమంగా జరుగుతుంది అనే సందర్భాలలో ప్రయోగంలో కనిపిస్తుంది. తొందరపాటు పనికిరాదని క్షణకాలం ఆగితే అంతా మంచిగా జరుగుతుందని చెప్పటానికి ఈ జాతీయాన్ని వాడుతుంటారు. ‘క్షణం గుణం తొందరపడొద్దు, అంతా మంచి గుంటుంది’ లాంటి సందర్భారాలలో ఇది విన్పిస్తుంటుంది.


పైకి పంపటం

చంపటం, హతమార్చటం అనే అర్థాలలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. మనిషి మరణించాక వూర్ధ్వ లోకాలకు వెళతాడనేది ఓ నమ్మకం. ఈ నమ్మకం ఆధారంగానే ఈ జాతీయం అవతరించింది. ‘వాడితో గొడవెందుకు ఇప్పటికీ ఇద్దరిని, ముగ్గురిని పైకి పంపాడు’ అనేలాంటి సందర్భాలలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది.


కుక్క దులిపినట్టు

కుక్క విశ్వాసానికి మరో పేరు. అయితే అది పెంచుకొనే విషయంలో మాత్రమే. ఊర కుక్కల విషయంలో అలాకాదు. ఎవరింట్లోనైనా తనకు ఆహారపదార్థాలు అందుబాటులో ఉన్నాయని అది గ్రహిస్తే ఇక అది ఆ ఇంటి చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. ఒక వేళ కొట్టినా, తిట్టినా దూరంగా పోయినట్టే పోయి మళ్ళీ అక్కడికొస్తుంది. కొట్టారన్న అవమాన భావన దానికసలుండదు. మనషుల్లో కూడా ఎవరైనా ఇలా ప్రవర్తిస్తుంటే ఈ జాతీయంతో పోల్చి చెప్పటం కనిపిస్తుంది. ‘వీడు నిన్న వాడిచేతిలో తన్నులు, తిట్లు తిన్నాడు. ఇవ్వాళ్ళ మళ్ళీ కుక్కదులిపనట్టు అవేమీ పట్టించుకోక వాళ్ళింటికే వెళ్ళొచ్చాడు’ అనే లాంటి సందర్భాలలో ఈ జాతీయప్రయోగం కనిపిస్తుంది.


కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకోవటం

గొప్పతనాన్ని, పవిత్రతను ఏ వ్యక్తికైనా ఆపాదించే సందర్భంలో ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది. పవిత్రులైనవారి పాదాలను లేదా దైవసములు అని అనుకొన్న వారి పాదాలు కడిగి ఆ నీటిని నెత్తిన చల్లుకోవటం ఓ సంప్రదాయం. దాని ఆధారంగా ఈ జాతీయం ఆవిర్భవించింది. ‘ఆయనెంతో గొప్ప మనిషి, ఆయన కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకోవచ్చు సుమా’ లాంటి సందర్భాలలో ఈ జాతీయం ప్రయోగం కనిపిస్తుంది. .


నాంది పలకటం

ప్రారంభించటం అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. సంప్రదాయ నాటకానికి ఉన్న లక్షణాలలో నాంది అనేది మొదటిది. సూత్రధారుడు రంగ స్థలం మీదకొచ్చి నాటకానికి ఆదిలో నాందిక చెబుతాడు. దీని అధారంగా ఈ జాతీయం ఆవిర్భవించింది. ‘మంత్రి ప్రారంభోత్సవం చేయటంతో ఈ ప్రాజెక్టుకు నాంది పలికినట్లయింది’ అనేలాంటి ప్రయోగాలలో ఈ జాతీయం కనిపిస్తుంది.


రక్తపు కూడు

తరులను హింసించి మరో వ్యక్తి సుఖాలనుభవిస్తున్న సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతారు. నెత్తటి కూడు అనే సమానార్థక ప్రయోగం కూడా ఉంది. రక్తంగా చేసి (అంటే విపరీతంగా శ్రమించటం అన్నది అర్థం)కష్టపడి సంపాదిస్తుంటారు కొందరు. ఆ శ్రమవల్ల లభించిన ఆదాయాన్ని అతడి దగ్గర నుంచి బెదిరించో, దొంగతనం చేసో, మరొక విధంగానో తీసుకొని అనుభవించటాన్ని రక్తపు కూడు తినడం అని అంటారు. అలాగే హత్యలు చేసి లేదా శారీరకంగా, మానసికంగా హింసించి దాని వల్ల వచ్చిన ఆదాయంతో బతకడం కూడా రక్తపు కూడు తినటమే అవుతుంది. ఇది ఎంతో నీచమైన పని. ‘నువ్వు అన్యాయంగా తెచ్చిన ఈరక్తపు కూడు నాకక్కరలేదు’ అనే లాంటి సందర్భాలలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు.


ఒళ్ళు మండటం

కోపం రావటం అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. సాధారణంగా ఎవరికైనా కోపం వచ్చినప్పుడు శారీరకంగా కలిగే పరిస్థితిని అధారంగా చేసుకొని ఈ జాతీయం ప్రయోగంలోకి వచ్చింది. కోప భావం కలిగిన వారికి శారీరకంగా అసహనం లాంటివి కలుగుతాయి. ఇలాంటి పరిస్థితిని ఒళ్ళు మండటం అని అంటారు. కోపతీవ్రత మంటవలన కలిగే బాధతో సమానంగా ఉండటమే ఇది జాతీయంగా ప్రచారం కావటానికి కారణం. ‘వాడి మాటలు వింటే చాలు నాకు మండినట్లవుతుంది’ అనే లాంటి సందర్భాలలో ఈ జాతీయం ప్రయోగం కనిపిస్తుంది.


హరిదాసు ఉల్లిగడ్డ

దుటి వారికి నీతులు చెప్పి తాను మాత్రం ఆ నీతులను ఆచరించకుండా ఉండేవాడిని గురించి చెప్పుకొనేటప్పుడు ఈ జాతీయాన్ని
ప్రయోగిస్తుంటారు. పూర్వం ఓ హరిదాసు హరికథ చెబుతూ భక్తులకు ఉల్లిగడ్డ తినవద్దని నీతులు చెప్పి ఇంటికొచ్చి తన భార్యతో కూరలో
ఉల్లిగడ్డ వేయటం మరచిపోవద్దన్నాడట. ఆ సంఘటన ఇలా జాతీయమైంది. ‘నేటి రాజకీయ నాయకులు హరిదాసు ఉల్లిగడ్డ తీరున వేదికలెక్కి
చెప్పే దొకటి, తీరా చేసేది మరొకటి అయింది’ అనే లాంటి సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది.


గున్న ఏనుగు

స్థూలకాయం ఉన్నవారు అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. దానికి కారణం ఆ వ్యక్తి గున్న ఏనుగు (ఏనుగు పిల్ల)లా లావుగా ఉన్నాడని భావించటమే. ఎగతాళి చేసే సమయాల్లో ఇటువంటి జాతీయాలను ఉపయోగించటం బాగా కనిపిస్తుంది. ‘మొన్నటిదాకా బక్కగా ఉండేవాడు. నీ పెంపకంలోకి వచ్చేసరికి గున్న ఏనుగులా తయారయ్యాడు’ అనేలాంటి సందర్భాలలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది.


కోతి కొమ్మ తప్పి దూకనట్టు

వాస్తవంకాక భ్రమ మాత్రమే అని చెప్పే లాంటి సందర్భాలలో ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది. కోతులు ఒక చెట్టు మీద నుంచి ఇంకో
చెట్టుమీదికి దూకుతూ ఉంటాయి. చూసేవారికి కోతి దూకేటప్పుడు ఎక్కడ కిందపడిపోతుందో అని భ్రమ కలుగుతూ ఉంటుంది. కానీ ఆ దూకే
కోతి ఎప్పుడూ కొమ్మ తప్పదు, కిందపడదు. ఈ భావాన్ని ఆధారంగా చేసుకొనే ఈ జాతీయం ప్రయోగంలోకి వచ్చింది. ‘వాడెప్పుడూ అంతే కోతి
కొమ్మ తప్పి దూకనట్టు వాడిపని వాడు చేస్తుంటాడు’ అనే లాంటి సందర్భాలలో ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది.


చేట భారతం

క విషయాన్ని బాగా విస్తరించి చెప్పటం అనే అర్థంలోనూ, పరిమాణంలో చాలా పెద్దవి అని చెప్పేటప్పుడు దీన్ని ప్రయోగిస్తుంటారు. బియ్యం లాంటి వాటిని చెరగటానికి ఉపయోగించే చోట వెడల్పుగా, పెద్దదిగా ఉంటుంది. ఇలా ఉండటమే ఈ జాతీయం ప్రయోగంలోకి రావటానికి కారణం. నిత్యం జీవితంలో ఉపకరించే వస్తువులు జాతీయాల ఆవిర్భావానికి కారణాలైనట్టు దీనివల్ల అవగతమవుతుంది. అలాగే భారతం అనేది విస్తృతమైన కథ కావటం చేత ఏదైనా విషయాన్ని ఆపకుండా చెప్పేస్తున్నప్పుడు ‘ఆ చేట భారతమంతా ఇప్పుడు నాకెందుకు చెబుతావు’ అని అనడం కనిపిస్తుంది. పరిమాణంలో పెద్దగా ఉన్న పుస్తకాలను కూడా ‘చేట భారతమంత’ ఉన్నాయి అని అనడం కూడా ఉంది.


సాన పెట్టటం

మంచిగా తీర్చిదిద్దటం, ఆకర్షణీయంగా మార్పులు, చేర్పులు చేయటం అనే అర్థాలలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. ముడిగా ఉన్నప్పుడు వజ్రమైనా అందంగా కనిపించదు. మంచి పనితనంతో చక్కగా సాన పెడితే దాని అందం బహిర్గతమవుతుంది. ఈ భావం ఆధారంగానే ఈ జాతీయం ఆవిర్భవించింది. ‘ఆయన శిక్షణ ఇచ్చాడంటే ఎలాంటి మొద్దు పిల్లాడైనా సాన పెట్టినట్టు మంచిగా తయారవుతాడు’ లాంటి ప్రయోగాలు ఉన్నాయి.


తెరలేపటం

ప్రారంభించటం అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. రంగస్థల కళా ప్రక్రియ ఆధారంగా ఈ జాతీయం ప్రయోగంలో కొచ్చింది. కళా రూప ప్రదర్శనకు ముందు రంగస్థలం తెరతో కనిపిస్తుంది. రంగం సిద్ధమై ప్రదర్శన ప్రారంభమవుతోందని అనుకొన్నప్పుడు తెరను లేపుతారు. అంటే ఇక కళాప్రక్రియ ప్రారంభమైందని అర్థం. అలాగే ఏ కార్యక్రమమైనా ప్రారంభమైంది అని చెప్పటానికి వాస్తవానికక్కడ తెరల్లాంటివి లేకపోయినా… ఈ జాతీయాన్ని వాడటం అలవాటుగా వస్తోంది. ‘ప్రభుత్వ అనుమతి లభించటంతో ఈ కార్యక్రమానికి తెరలేచినట్టయింది’ అనే లాంటి సందర్భాలలో ఈ ప్రయోగం కనిపిస్తుంది.


కోడికన్నా గుడ్డునయం

కోడిగుడ్డు నుంచి పిల్ల బయటకొచ్చి పెరిగి పెద్త్దె కూర వండుకొనేందుకు ఉపయోగపడుతుంది. అయితే.. అప్పటి దాకా ఎందుకు అంతకాలం ఆగటం అనవసరం, ఇప్పటికిప్పుడు దొరికిందేదో అనుభవిద్దాం అనుకొనేవారు దొరికిన కోడిగుడ్డును వండుకుతినేస్తారట. అది అవకాశవాద విధానం. ఇలా అవకాశ విధానంతో ఎవరైనా ప్రవర్తిస్తుంటే ‘వాడంతే, కోడికన్నా గుడ్డునయమనుకొనే రకం. ఎక్కువకాలం ఆగకుండా ఎప్పటి పొలం అప్పుడు అమ్మేసుకుంటూ వచ్చాడు’ అనే లాంటి సందర్భాలలో ఈ జాతీయం విన్పిస్తుంది.


వేలెడంత

స్వల్ప పరిమాణం అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. చేతి వేలు పరిమాణం చిన్నదిగా ఉంటుంది. అంత చిన్నది అనే భావనకు ప్రతిరూపంగా ఈ జాతీయం ఆవిర్భవించింది. ‘వేలెడంత లేవు నీకప్పుడే ఇవన్నీ ఎందుకు’ అనే లాంటి ప్రయోగాలు వాడుకలో ఉన్నాయి.


గడ్లె బుర్రిగాడు

గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని కొన్ని పేర్లు విచిత్రంగా కొన్ని ప్రవృత్తుల వారికి స్థిర పడిపోతూ ఉంటాయి. పూర్వం ఎప్పుడో ఎవరో చేసిన పని ఆధారంగా అలాంటి పనులే ఆ తరువాతి కాలంలో ఎవరు చేసినా ఆ ముందు చేసిన వ్యక్తి పేరే ప్రచారమవుతూ ఉంటుంది. ఎల్లయ్య అనే వ్యక్తి ఎప్పుడో వెకిలిగా నవ్వి ఉంటే ఎకిలి నవ్వుల ఎల్లయ్య అని ఆ తరువాత కాలాల్లో ప్రచారంలోకి వస్తుంది. ఆ ఎల్లయ్యేగాక వెకిలిగా ఎవరు నవ్వినా ‘ఎంటలా ఎకిలి నవ్వుల ఎల్లయ్యలా నవ్వుతావ్‌’ అని అంటూ ఉంటారు. గడ్లె బుర్రిగాడు అనే జాతీయం కూడా అలాంటిదే. ఇది గడ్డిలో బుర్రిగాడు అనే పదాల కూర్పుతో వచ్చింది. తెలంగాణా గ్రామీణ ప్రాంతాల్లో ఇది వినిపిస్తూ ఉంటుంది. పూర్వం ఎప్పుడో గడ్డిలో బుర్రిగాడు అనే వాడు విదూషకుడిలా విచిత్ర వేషాలతో అందరినీ నవ్వించేవాడట. ఆ బుర్రిగాడు ఎప్పుడూ గడ్డిలోనే ఉండేవాడో లేదంటే గడ్డిలో ఉండి మాత్రమే వినోద కార్యక్రమాలు చేసేవాడో కచ్చితంగా ఎవరూ తేల్చి చెప్పలేరు. కానీ ఈనాటికీ ఎవరైనా విచిత్ర వేషాలు వేస్తూ చిన్నా పెద్దా అందరికీ విదూషకుడిలా వినోదం కలిగిస్తుంటే ‘ఆడంతేలే గడ్లె బుర్రిగాడి లెక్క అట్టా ఎప్పుడూ చేస్తా ఉంటాడు’ అనేలాంటి ప్రయోగాలు విన్పిస్తుంటాయి.


కొంగున నిప్పును ముడేసుకోవటం

ప్రమాదాన్ని కోరి తెచ్చుకోవటం అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. కట్టుకున్న వస్త్రపు కొంగుకు నిప్పును ముడి వేసుకొంటే ఎంత
ప్రమాదమో ఎవరైనా ఊహించవచ్చు. ఇలాంటి ప్రమాదకరమైన విషయాన్ని దేన్నైనా కోరి కోరి నిజ జీవితంలో తెచ్చుకొన్నప్పుడు ఈ జాతీయాన్ని
ప్రయోగించటం కనిపిస్తుంది. ‘వాడు ఎలాంటి వాడో తెలుసుకోకుండా స్నేహం చేసి నందువల్లే ఇప్పుడు కొంగున నిప్పు ముడేసుకున్నట్టయింది’
లాంటి ప్రయోగాలున్నాయి..


కన్నంలో కత్తి

కస్మాత్తుగా హానికలిగించేవాడు అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. ఇది పూర్వకాలపు రాజప్రాకారాల నిర్మాణ విశేషం నుంచి ఆవిర్భవించిన జాతీయం. పూర్వం కోటగోడకు అక్కడక్కడా సన్నని కన్నాలను కూడా చేసి ఉంచేవారు. వాటిలో కొన్నిటిలో రహస్యంగా కత్తులు అమర్చి ఉండేవి. కాపలా కాసే సైనికులు కొన్ని కన్నాలలో నుంచి అవతలవైపు వారిని గమనిస్తూ శత్రువులొస్తున్నారనుకొన్నప్పుడు కన్నంలోని కత్తిని వేగంగా ముందుకు తోసేవారు. శత్రు సైనికుడి మీద హఠాత్తుగా అలా కత్తులు పడి అంతం చేస్తూ ఉండేవి. ఆ నాటి కన్నంలోని కత్తి అకస్మాత్తుగా వచ్చి ఎలా మీదపడి నష్టం కలిగించేవో అలానే ఎవరైనా ఉన్నట్టుండి ఒక్కసారిగా వచ్చి నష్టపరచి వెళ్ళినప్పుడు ‘అసలు ఊహించటానికే అవకాశం లేకుండా కన్నంలా కత్తిలా వచ్చిపడి ఇలా నష్టపెట్టి వెళ్ళాడు’ అనే లాంటి ప్రయోగాలు విన్పిస్తుంటాయి.


చేతులు కడగటం

భోజనం చేయడం అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. అన్నం తిన్న తరువాత చేయి కడుక్కోవటం సహజం. ఇది అందరూ చేసే పనే. ఈ పని ఆధారంగా ఈ జాతీయం ఆవిర్భవించింది. ‘ఇవ్వాళ మీరు మా ఇంట్లో చేయి కడగాలి సుమండీ’ అనే లాంటి ప్రయోగాలు కనిపిస్తున్నాయి. ఆధునిక సమాజంలో భోజన శాలల్లో చెంచాలతో అన్నం తినే పరిస్థితికి సంబంధించిన జాతీయం కాదిది. పూర్తిగా పూర్వ కాలం నాటి పద్ధతిలో చేత్తో అన్నం కలుపుకొని హాయిగా తిని లేచి వెళ్ళి చేయి కడుక్కునే కాలం నాటిది. ఆనాడు ఆవిర్భవించినదే అయినా ఈనాటికీ చాలా ప్రాంతాల్లో చేయి కడగటం అంటే భోజనం చేయడం అనే అర్థంలో ఇది వాడుకలో ఉంది. .


బుడితి ఖాతా

వ్యాపార రంగాన్ని ఆశ్రయించుకొని ఈ జాతీయం ఆవిర్భవించింది. తెలంగాణా ప్రాంతంలో ఇది ప్రయోగంలో కనిపిస్తుంది. దుకాణాలలోనూ, కొంతమంది వ్యాపారస్తుల దగ్గర కొందరు వినియోగదారులు ఖాతా తెరుస్తుంటారు. సంవత్సరాని ఒకసారి ఆ దుకాణదారులు, వ్యాపారస్తులు ఖాతాలను సరిచూసుకుంటుంటారు. అప్పు తీసుకొన్న వినియోగదారుల్లో కొంతమంది ఏదో కారణంవల్ల ఖాతాకు డబ్బు జమ చేయరు. ఖాతాదారుడు మరణించటమో, పారిపోవటమో, ఇలాంటి దేదైనా దానికి కారణం కావచ్చు. అలాంటి ఖాతాలను బుడితి ఖాతాలు అని
అంటుంటారు. అంటే సక్రమంగా జమకాని ఖాతాలు అనేది అర్థం. నిజ జీవితంలో ఎవరైనా మరొకరి దగ్గర డబ్బు తీసుకొని తిరిగి ఇవ్వకుండా ఉన్న పరిస్థితులలో ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది. ‘వానికి డబ్బివ్వటమంటే బుడితి ఖాతానే అన్నది నా నమ్మకం’ లాంటి ప్రయోగాలు ఉన్నాయి.


కాళ్ళీడ్చుకుంటూ

ప్రగతిలేక పోవటం, ఎంతో నిదానంగా, నిరుత్సాహంగా పనులు జరగటం అనే అర్థాల్లో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. మనిషి హావ భావాలు, నడక, పరుగులు లాంటివి కూడా జాతీయాల ఆవిర్భావాలకు మూలాధారాలే. ఏ మనిషైనా శక్తి హీనుడై ఉన్నప్పుడు కదలలేక కదలలేక నడుస్తుంటాడు. ఈ నడక తీరు నేల మీద కాళ్ళు మెల్లగా ఈడ్చుకుంటూ నడుస్తున్నాడా అని కూడా అనిపిస్తుంది. ఇలా నడిచే వ్యక్తి శక్తి హీనత వల్ల చేయాల్సిన పని సకాలంలో చెయ్యలేడు. ఇది అసమర్థతకు కారణమవుతుంది. ఒక వ్యక్తి దగ్గర సామర్థ్యం లేదని చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది. ‘అలా కాళ్ళీడ్చుకుంటూ వెళితే… ఆ పని ఎప్పటికీ కాదు’ అనే లాంటి సందర్భాలలో ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది. వాస్తవానికి పనిచేస్తున్న వ్యక్తి శారీరకంగా, కాళ్ళల్లో బలం ఉన్నా చేసే పనిలో శ్రద్ధలేక పోవటం, అతి నిదానంగా అయిష్టంగా పనిచేయటం జరుగుతున్నప్పుడు ఈ జాతీయాన్ని ప్రయోగించటం కన్పిస్తుంది.


సింగరాజు లింగరాజు

జాతీయాల ఆవిర్భావానికి మానవ జీవన క్రమమే కాదు, సాహిత్యం కూడా ఆధారమవుతూ ఉంటుంది.. అని చెప్పటానికి ఈ జాతీయం ఓ ఉదాహరణ. తెలుగు సాహిత్యంలో వర విక్రయం అనే నాటకానికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. కాళ్ళకూరి నారాయణరావు ఈ నాటకాన్ని రాశారు. ఈ నాటకంలో ఆశపోతుగా, పరమ లోభిగా చిత్రితమైన పాత్ర సింగరాజు లింగరాజు. అదే తీరులో ఎవరైనా ప్రస్తుత సమాజంలో కూడా ప్రవర్తిస్తుంటే ‘వీడెవడురా… ఒట్టి సింగరాజు లింగరాజులా ఉన్నాడు’ అని అనడం కనిపిస్తుంది.


ఒళ్ళు చలువలు కమ్ము

విపరీతమైన భయం కలగటం అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. భయం కలిగినప్పుడు వణకడం, ఆ స్థితి కూడా దాటాక ఒళ్ళంతా చల్లబడటం అనే శారీరకమైన పరిణామాలు సంభవిస్తుంటాయి. ఒళ్ళు చల్లబడటమంటే తీవ్రమైన భయాందోళనల స్థితి అనే అర్థం ఈ కారణంగానే వచ్చింది. ‘ఒక్కసారిగా ఆయనక్కడ చూడగానే నా ఒళ్ళంతా చలువలు కమ్మేసి నట్టయింది’ లాంటి ప్రయోగాలున్నాయి.


నాంచారమ్మ వంట

జాతీయంలో కనిపించే స్త్రీ ఎవరో ఏమిటో కచ్చితంగా తెలియదని భాషా శాస్త్రవేత్తలు చెబుతుంటారు. మానవ జీవనంలో ఎదురయ్యే కొందరు మనుషుల తత్వాలు కూడా జాతీయాలుగా రూపొందాయనటానికి ఇదొక ఉదాహరణ. ఏ తరం లోనో, ఏ కాలంలోనో నాంచారమ్మ అనే ఒక మహిళ ఉండేదట. ఆమె చేసిన వంట రుచికరంగానే ఉండేదట కానీ, వంట చేయటం మొదలు పెడితే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అన్నీ గడిచిపోయి రాత్రి సమయం అయ్యేదట. దీని ఆధారంగానే నాంచారమ్మ వంట నక్షత్ర దర్శనం అనే ఓ సామెత కూడా బహుళ ప్రచారంలో
ఉంది. సమర్థంగా పని చేసేవారు ఆ పనిని పూర్తి చేయటానికి ఎక్కువ సమయం తీసుకుంటున్నప్పుడు ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది.
‘ఆ పని వాడికెందుకు అప్పజెప్పావు. నాంచారమ్మ వంటలా ఎప్పటికి అవుతుందో ఎవరికీ తెలియదు’ అనే లాంటి ప్రయోగాలున్నాయి.


గోడకేసిన సున్నం

వృథా వ్యయం, తిరిగిరానిది, అనవసరమైన ఖర్చు అనేలాంటి అర్థాలలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. గోడకు అప్పుడప్పుడూ వెల్ల (సున్నం) వేస్తుంటారు. గోడకు వేసే ముందు సున్నాన్ని తొట్టిలో కలుపుతుంటారు. అప్పుడు తొట్టి నిండా సున్నం కనిపిస్తుంది. వెల్ల వేసిన తర్వాత ఎన్ని ప్రయత్నాలు చేసి గోడ గీరినా మళ్ళీ అంతలా సున్నం కనిపించదు. అలాగే కొన్నిచోట్ల పెట్టిన పెట్టుబడి, కొందరికిచ్చిన డబ్బు వృథా అయ్యాయి, అవుతాయి అనే అర్థాలలో చెప్పుకొనేటప్పుడు ఈ జాతీయాన్ని వాడుతుంటారు. ‘వాడికి డబ్బివ్వటమంటే గోడకేసిన సున్నంలాంటిదే ఆ విషయం తెలుసుకో’ లాంటి ప్రయోగాలున్నాయి.


రాముడున్న దగ్గరే అయోధ్య

కొంతమంది పలుకుబడి కలవారు, అధికార సంపన్నులను గురించి మాట్లాడుకొనేటప్పుడు ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది. అధికారం ఉన్నవారు ఎక్కడుంటే అక్కడ వచ్చేపోయే వారితో సందడి సందడిగా కళకళలాడుతుంటుంది. ఆనాడు శ్రీరామచంద్రుడు అయోధ్యలో ఉన్నప్పుడు రాజమందిరమంతా ఎంత కళకళలాడుతుండేదో ఊహించుకొంటూ ఏర్పడిన జాతీయమిది. రాముడంతటి వాడు ఎక్కడికొస్తే అక్కడికల్లా మంత్రి మండలి, మిగతా వారు అంతా వచ్చేస్తారు కదా. అలాగే ఈనాడు కూడా కొన్ని ప్రాంతాల్లో రాజకీయ పక్షం వారు భారీ సమావేశాలను, ఉత్సవాలను ఏర్పాటు చేసినప్పుడు ఆ ప్రదేశం అంతా ఎంతో సందడిగా తయారవుతుంది. అలాంటి సందర్భాలలో ‘ప్రధానమంత్రి పర్యటన కోసం ఈ మారుమూల పల్లెను ఇంత సుందరంగా అలంకరించారు. రాముడున్న దగ్గరే అయోధ్య కదా అన్నట్టు తరలివచ్చింది’ అనే లాంటి ప్రయోగాలు కనిపిస్తున్నాయి.


ఈగెంత – పేగెంత

ల్పుడి గురించి మాట్లాడుకునేటప్పుడు తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో వినిపించే జాతీయమిది. వాడెంత.. వాడి బతుకెంత అనేది దీని అర్థం. ఈగ ఎంత, పేగు ఎంత అనే పదాలు కలిసి ఈ జాతీయం ఏర్పడింది. ఈగ చిన్న ప్రాణి, ఇక దాని లోపలి పేగు ఎంత చిన్నదిగా ఉంటుందో చెప్పనక్కర లేదు. ఈగ లాంటి అల్పుడు అని తిరస్కారంగా మాట్లాడాలనుకొన్నప్పుడు ఈ జాతీయాన్ని ప్రయోగిస్తుంటారు.


మురిగినకాలు

అంతటినీ నాశనం చేసేవాడు, చెడగొట్టేవాడు అనే అర్థాలలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. కొన్ని సందర్భాలలో కొంత మందికి కాలికి గాయమైతే, గాయమైన భాగం వరకూ తొలగించాలని, లేకపోతే దాని ప్రభావంతో మిగిలిన శరీరం కూడా పాడైపోయే ప్రమాదముందని వైద్యులు చెబుతుంటారు. అలా పాడైపోయిన (మురిగిన) భాగాన్ని వెంటనే తొలగిస్తుంటారు కూడా. కాని పక్షంలో అనవసర ప్రాణహానిని కొని తెచ్చుకోవటం జరుగుతుంది. అలాగే కొంత మంది దుర్మార్గులు చేసే పనులను మొదటే గుర్తించి వాటిని అరికట్టాలి. లేకపోతే మురిగిన కాలులాంటి ఆ దుర్మార్గులు చుట్టూ ఉన్న సమాజాన్నంతటినీ కలుషితం చేస్తారు. ఈ భావనతోనే ఈ జాతీయం ప్రచారంలో కనిపిస్తుంది. ‘మురిగిన కాలులాంటి వాడని తెలిసే వాడిని ఆ పక్షం వారు బయటకు గెంటేశారు’ లాంటి ప్రయోగాలున్నాయి.


శిరోధార్యం

గౌరవించదగినది అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. శరీరంలోని అన్ని అంగాలలోకి శిరస్సుకు ఉత్తమాంగమని పేరు. శరీరానికంతటికీ అదే ప్రధానం. అలాంటి శిరస్సు మీద ధరించటమంటే దానికిచ్చే గౌరవం అసమానమైనదని భావం. ఇదే నెత్తిన పెట్టుకోవటం అనే రూపంలో కూడా కనిపిస్తుంది. ‘ఆయన ఆజ్ఞ శిరోధార్యమని నేను భావిస్తున్నాను’ లాంటి ప్రయోగాలు ఉన్నాయి.


కథల కామరాజు

థలు బాగా చెప్పేవారిని అంటే… వాస్తవ విరుద్ధమైన అంశాలు, అభూతకల్పనలను చేస్తూ కాలంగడిపే వారిని ఈ జాతీయంతో సూచిస్తుంటారు. కామరాజు అనే వ్యక్తి ప్రత్యేకించి ఎవరో తెలియక పోయినా ఇలా అవాస్తవాలను కూడా వాస్తవమే అన్నట్టు నమ్మబలికే వ్యక్తులను కథల కామరాజు అంటుంటారు. ‘వాడి మాటలకేంలే… వాడొట్టి కథల కామరాజు’ అనే లాంటి ప్రయోగాలున్నాయి.


గొడుగు పట్టటం

శ్రయం కల్పించటం అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. ఎండ, వానల నుంచి గొడుగుతో కొంత వరకూ రక్షణ పొందవచ్చు గొడుగు అలా వానలో తల తడవకుండా ఎండకు తల వేడెక్కకుండా కాపాడుతుంది. ఇక్కడ గొడుగు అనేది రక్షణకు ప్రతీక. గొడుగును పట్టటం అంటే రక్షించటం లేదా ఆశ్రయం కల్పించటం అనేది అర్థం. ఈ అర్థంతోనే ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. అలాగే మరికొన్ని చోట్ల గౌరవించటం అనే అర్థం కూడా కనిపిస్తుంది. సమయ సందర్భాల ఆధారంగా ఇలాంటి అర్థలతో ఈ జాతీయ ప్రయోగం ఉంది. ”ప్రతి పక్షం నుంచి వచ్చిన వ్యక్తికి ఆ నాయకుడు గొడుగు పట్టాడు.” లాంటి ప్రయోగాలున్నాయి.


కాలు దువ్వటం

నిషి తన చుట్టూ ఉండే జంతువుల ప్రవర్తన తీరును కూడా జాతీయాల ఆవిర్భావానికి ఓ సాధనంగా ఎంచుకున్నాడని అనడానికి ఇదొక
ఉదాహరణ. ఎద్దులాంటి పెద్ద జంతువులేకాక కుక్కల లాంటి చిన్న జంతువులు కూడా తమకు కోపం వచ్చిందని శత్రువు మీదకు తాము దాడికి
సిద్ధమవుతున్నామని ప్రకటించే కొన్ని చేష్టలను చేస్తూ ఉంటాయి. వీటిలో కాలు దువ్వటం కూడా ఒకటి. ఎద్దు ఎదురుగా ఉన్న పోటీ ఎద్దు
మీదకు దూకటానికి తల వంచి కొమ్ములను ముందుకు చాచికాలు దువ్వుతుంది. ఈ చేష్టను బట్టి అది దాడికి సిద్ధమైందని ఎదుటి జంతువు అర్థం చేసుకుంటుంది. ఈకాలు దువ్వటానికి మనిషి తన కోప భావ ప్రకటన అనే దానికి జాతీయంగా రూపొందించుకొని ప్రయోగిస్తూ వస్తున్నాడు వాడంతేనండి ఎప్పుడూ కయ్యానికి కాలు దువ్వుతూనే ఉంటాడు’ అనే లాంటి ప్రయోగాలున్నాయి.


వేదాలు వల్లించటం

వేదాలు సర్వ ధర్మాలకు మూలాల వంటివని అంటారు. ధర్మం ద్వారా లోకనీతి వర్థిల్లుతూ ఉంటుంది. అలా వేదాలు అంటే నీతులు అనే ఒక స్థూల అర్థం వ్యాప్తిలో ఉంది. వేదాలు వల్లించటమంటే నీతులు చెప్పటంగా ప్రచారంలోకి వచ్చింది. ‘వాళ్ళు చేసేవన్నీ అవినీతి పనులు. ఇప్పుడు వేదికలెక్కి వేదాలు వల్లిస్తుంటే వినే వారికి నవ్వొస్తుంది’ లాంటి సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది.


యమ యాతనలు

రించరాని కష్టాలు అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. మరణానంతరం పుణ్యం చేస్తే స్వర్గానికి, పాపం చేస్తే నరకానికీ
పోతారన్నది ఓ విశ్వాసం. నరకంలో యమదూతలు పెట్టే కష్టాలు అతిభయంకరంగా ఉంటాయంటారు. రంపాలతో కోయటం, నూనెలో
వేయించటం లాంటి బాధలను యమ దూతలు పెడతారట. ఆ బాధలను పోలిన బాధలు అని చెప్పాల్సి వచ్చినప్పుడు ‘ఆ పని కాస్త కావటానికి
ఎన్నో యమయాతనలు పడాల్సొచ్చింది సుమా!’ లాంటి సందార్భాలలో ఈ జాతీయాన్ని ప్రయోగిస్తుంటారు.


పట్టుకొచ్చిన కుక్కలు

విశ్వాసం ఉన్నట్లుగా కనిపిస్తూ విశ్వాసం లేని విధంగా ప్రవర్తించే వారిని గురించి చెప్పే సందర్భంలో ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది.
కుక్కలు విశ్వాసానికి ప్రతీకలు. అయితే… ఇవి పెంపుడు కుక్కలైనప్పుడు మాత్రమే యజమాని మీద విశ్వాసాన్ని కనబరచటం జరుగుతుంది.
కొత్తగా పట్టుకొచ్చిన కుక్కలు ఆ పట్టుకొచ్చిన వారిని భయం భయంగా చూస్తూ విశ్వాసాన్ని కనబరచవు. కుక్కే కదా విశ్వాసంగా ఉంటుందిలే
అని అనుకొంటే అది ఇంటికెవరైనా కొత్తవారొచ్చినా మొరగదు. ఇలాగే ఒక నాయకుడి దగ్గరకి వేరొక పక్షం నుంచి వచ్చిన కార్యకర్తల్లాంటి వారు
తొలిరోజుల్లో ఆ నాయకుడి మీద అంత విశ్వాసాన్ని కనబరచరు. ‘ఆ రాజకీయ పక్షంలో ఉన్న వారంతా పట్టుకొచ్చిన కుక్కల్లాంటి వారే అందుకే
ఆ పక్షం ఎదగటంలేదు’ లాంటి ప్రయోగాలు విన్పిస్తాయి.


అతిరథ మహారథులు

జాతీయానికి చాలా గొప్పవారు అనే అర్థం ప్రచారంలో ఉంది. అయితే పూర్వం రాచరిక వ్యవస్థ, మళ్ళీ దానిలో అంతర్భాగంగా ఉండే రణరంగ యోధుల ప్రత్యేకతలను ఋజువు చేసే పదాలు ఇవి. అనేక మందితో యుద్ధం చేసేవాడిని అతిరుథుడు అంటారు. మహారథుడు అంటే తనను, సారథిని, గుర్రాలను కాపాడుకుంటూ పదకొండు వేల మంది విలుకాండ్రతో యుద్ధం చేసేవాడిని మహారథుడు అంటారు. భారతంలో దుర్యోధనుడు, కృత వర్మ, శల్యుడు, భూరిశ్రవుడు, నీలుడు, కృపుడు, ద్రోణుడు, బాహ్లికుడు, సోమదత్తుడు లాంటి వారు అతిరథ స్థానంలో కన్పిస్తారు. ఇక మహారథుల విషయానికోస్తే సైంధవుడు సుశర్మ, సత్యరథుడు, అశ్వత్థామ లాంటి వారు మహారథుల స్థానంలో కన్పిస్తారు. ఆనాడు ఈ అతిరథ మహారథులు ఎంత వీరోచితంగా పోరాడారో అంత వీరోచిత స్థాయిలో ఎవరైనా శక్తి యుక్తులను ప్రదర్శిస్తున్నప్పుడు ‘వారి కేమండీ. వారంతా అతిరథ మహారథులు సుమా!’ అనే లాంటి ప్రయోగాలున్నాయి.


గుడ్డేనుగు గుర్రుకొట్టినట్లు

తెలంగాణా గ్రామీణ ప్రాంతాల్లో వినిపించే జాతీయమిది. ఇతర మండలాల్లో ఎలుగుబంటి, ఎలుగుగొడ్డు అని పిలిచే జంతువును గుడ్డేనుగు అని కొంతమంది అంటుంటారు. ఎలుగుబంటి నిద్రపోయేటప్పుడు గురక పెడుతుంది. అలా ఎవరైనా నిద్రిస్తూ గురక పెడుతున్నప్పుడు ‘వాడంతే గుడ్డెనుగు గుర్రుకొట్టినట్టు గురకపెడతాడు’ లాంటి ప్రయోగాలు ఉన్నాయి.


భల్లూకప్పట్టు

విషయాన్నైనా గట్టిగా పట్టుకోవటం, సాధించేదాకా వూరుకోకపోవటం అనేలాంటి అర్థాలలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. ఎలుగుబంటి పట్టుకుంటే విడిచిపెట్టదట. అంతటి గట్టి పట్టు అనేది దీనికున్న అర్థం. ‘ఎలాగైతేనేం భల్లూకప్పట్టు పట్టి కార్యాన్ని సాధించుకొచ్చాడు’ లాంటి ప్రయోగాలున్నాయి.


పిట్టను కాల్చినట్టు

చాలా తేలికగా జరిగే పని అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. పిట్టల వేటగాళ్ళు వేటాడేటప్పుడు ఏమాత్రం కనికరం లేకుండా దగ్గరున్న తుపాకీతో గురిచూసి పిట్టను కాల్చేస్తారు. ఈ ప్రక్రియలో వారికి శారీరక, మానసిక శ్రమ ఏమాత్రమూ ఉండదు. అదో సాధారణ పనిగా చేసుకుంటూ పోతారు. పిట్ట నేలకూలిన తర్వాత అయ్యో చంపామా అని బాధపడటమో, దిగులుపడటమో ఇవేవీ జరగవు. అదే తీరులో తోటి మనుషులను కూడా ఎవరైనా హింసించే సందర్భంలో ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది. ‘మళ్ళీ ఆ దారిన వెళితే పిట్టను కాల్చినట్టు కాల్చేస్తానని బెదిరించాడు వాడు’ లాంటి సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది.


చచ్చి పుట్టినట్టు

ఘోర ప్రమాదం నుంచి బయటపడిన సందర్భాలలో ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది. భారతీయంలోని కర్మ సిద్ధాంతాన్ని, పునర్జన్మను ఆధారంగా చేసుకొని ఈ జాతీయం ఆవిర్భవించిందని అంటారు. మరణించాక జీవుడు మళ్ళీ చేసుకొన్న పాప పుణ్య కర్మల ప్రకారంగా మరో గర్భంలోకి ప్రవేశిస్తాడట. గర్భవాసం అనేది భరించరాని బాధాకరంగా ఉంటుందని అంటారు. తరువాత మళ్ళీ జన్మించాక సుఖాలు, ఆనందాలు, కష్టాలు లాంటివన్నీ మామూలే. ఇదే ఈ జాతీయానికి ఆధారమైన భావన. ఎవరైనా ఘోర ప్రమాదంలో చిక్కుకొని ఎలాగో ఒకలాగా బతికి బయటపడ్డప్పుడు ప్రమాద బాధను శారీరకంగా, మానసికంగా అనుభవిస్తారు. ఆ బాధంతా మరణించటం, ఆ తర్వాత కలిగే గర్భవాస క్లేశం
లాంటి వాటితో సమానమైనవైతే, ఆ ప్రమాదం నుంచి బయటపడి మామూలుగా జీవించటమనేది తిరిగి పుట్టడం లాంటి దానితో సమానం. ‘అందుకే ఆ సంఘటన జరిగిన తరువాత చచ్చి పుట్టినట్టుంది నాకు’ లాంటి ప్రయోగాలు ఉన్నాయి.


పూస గుచ్చినట్టు

క్రమ పద్దతిలో అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తోంది. పూసలతో దండను గుచ్చేటప్పుడు ఒకే పరిమాణం ఆకారంలో ఉన్న
పూసలన్నిటినీ ఒద్దికగా గుచ్చి దండగా కూరుస్తారు. అలా క్రమ పద్ధతిలో ఏ విషయమైనా ఎవరైనా వివరిస్తున్నప్పుడు ‘పూస గుచ్చినట్టు జరిగిన
కథనంతా వాడు చెప్పేస్తాడు వినండి’ అనే లాంటి ప్రయోగాలు ఉన్నాయి.


నీటిబుడగ

క్కువకాలం నిలవనిది, అశాశ్వతమైనది అనే అర్థాలలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. జీవితంలో ఎదురయ్యే ప్రతి చిన్న విషయాన్ని మనవారు అనుభవానికి ముడిపెడుతూ వాటికి జాతీయాల రూపాన్నిచ్చారని చెప్పటానికి ఇదొక ఉదాహరణ. పైనుంచి నీరు పడుతున్నప్పుడో, మరొకప్పుడో నీటిలో బుడగలు పుడుతూ ఉండటం, వెంటనే అంతరించిపోతూ ఉండటం చూసి… దాన్ని ఏకంగా మనిషి జీవితానికే ఆపాదించి చెప్పారు. నీటి బుడగ ఎంత అశాశ్వతమో జీవితం కూడా అంతే అశాశ్వతమని గ్రహించమని బోధించే సందర్భాలలో ‘నీటి బుడగ జీవితం తెలుసుకోండర్రా’ అని అనటం కనిపిస్తుంది.


గుడిపాము

ర్పపూజ అనేది మన సంప్రదాయంలో ఏనాటి నుంచో ఉంది. నాగుల చవితి, నాగపంచమి లాంటి పండుగలు చేసుకోవటం అందరికీ తెలిసిందే. అలాగే పలు ఆలయాలలో పాము పుట్టలు ఉంటాయి. వాటికి పాలుపోసి పూజిస్తుంటారు. ఆ పుట్టలో ఉండే సర్పం బయటకు ఎక్కడికి పోకుండా అక్కడే ఉంటుందని భక్తులు విశ్వసిస్తారు. ఈ విశ్వాసం ఆధారంగా అవతరించింది ఈ జాతీయం. ఎప్పుడూ ఏ వూరికీ, ఎక్కడికీ కదలకుండా ఇంట్లోనే ఉండే వారిని పేర్కొనడానికి ఈ జాతీయాన్ని వాడుతుంటారు. ‘ఎప్పుడూ గుడి పాములాగా ఇక్కడే పడుండక పోతే కాస్త బయటకు ఎక్కడికైనా వెళ్ళి రావచ్చు కదా’ అనే లాంటి ప్రయోగాలు ఉన్నాయి.


పెద్దపులి పాలు తేవటం

త్యంత సాహసోపేతం దాదాపు అసంభవమైన పని అనే అర్ధంలో ఈ జాతీయాన్ని ప్రయోగించటం కనిపిస్తుంది. ఈనిన తరువాత పిల్లలున్న పులి దగ్గరకు వెళ్ళి పాలు పితికి తేవటం ఎంత అసాధ్యమో అంతటి అసాధ్యమైన పని అనే అర్థంలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది. ‘ఆ పనికి దిగడమంటే పెద్దపులి పాలు తేవటం లాంటిదే’ అనేలాంటి ప్రయోగాలున్నాయి.


బండోడు

బండలాంటి వాడు అనే అర్ధంలో జాతీయం ప్రయోగంలో ఉంది. రాతిబండకు చలనం అనేది ఉండదు. ఏ స్పర్శకూ అది స్పందించదు. అలాగే అంత బండబారి కొంతమంది ఉంటారు. కళ్ళముందు ఏం జరుగుతున్నా అసలు స్పందించరు. ఇలాంటి వారిని పేర్కొనటానికి ఈ జాతీయాన్ని వాడుతుంటారు. ‘ఆ బండోడికి చెప్పినా ఒకటే, చెప్పకపోయినా ఒకటే… ఏం పట్టించుకోడు’ లాంటి ప్రయోగాలున్నాయి.


కట్ట కట్టుకొని

కం కావటం అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. విడివిడిగా ఉన్నవాటిని ఒక చోటకు తెచ్చికట్టివేస్తే అవన్నీ ఒకటే నన్నట్టు అనిపిస్తుంది. ఈ భావనతోనే కొంతమంది కలిసి ఒకేచోటకి వెళుతున్నప్పుడు, ఒకే అభిప్రాయాన్ని ప్రకటిస్తున్నప్పుడు ఈ జాతీయాన్ని వాడుతుంటారు. ‘అంతా కట్ట కట్టుకొని ఒకేసారి వెళితేకానీ ఆ పని జరిగేటట్టులేదు’ అనేలాంటి సందర్భాలలో ఈ జాతీయం ప్రయోగంలో కన్పిస్తుంది.


వండిన కుండ

నుభవించటానికి సిద్ధంగా ఉన్నది అనే అర్ధంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. తలపెట్టిన కార్యం ఏదైనా సంపూర్ణమై ఇక దాన్ని గురించి వేరే ఆలోచన లేదు, అంతా ఆనందమే అని చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది. ఈ జాతీయం తెలంగాణా గ్రామీణ ప్రాంతంలో ఎక్కువగా వినిపిస్తుంది. ఇదే సిద్ధాన్నం అనే రూపంలో ఇతర ప్రాంతాల్లో వాడుకలో ఉంది. ‘పరిస్థితినంతా వాడు వండిన కుండ తీరు చక్క బెట్టిండు, మనకిక ఏ బాధా లేదు’ లాంటి సందర్భాలలో ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది.


శ్రీమంతం అనంతం

ప్రపంచంలో ధనార్జనపరులు, ధనవంతులు ఒకరికంటే మరొకరు ఎప్పుడూ అధికులుగా ఉంటూనే ఉంటారని తెలియజెప్పే జీవన సత్య ప్రతిబింబం ఈ జాతీయం. ఇంతకంటే ధనవంతుడు ఎవరూ లేరని ఖచ్చితంగా చెప్పటానికి ఎప్పుడూ అవకాశం ఉండదు. అలా ఒకడిని ధనవంతుడు అని నిర్ణయించి అంతలోనే మరొకడెవరో ఇంకొంత ఎక్కువ సంపాదించే అవకాశం ఉంటుంది. ఈ భావనే ఈ జాతీయ ఆవిర్భావానికి కారణం. ‘నువ్వొక్కడివే ధనవంతుడివి అనుకోకు… శ్రీమంతం అనంతం అని తెలుసుకొని గర్వం తగ్గించుకో’ అనే లాంటి సందర్భాలలో ఈ జాతీయం కనిపిస్తుంది.


మూతి బిగించటం

పెదవి విప్పక పోవటం అనే రూపంలో కూడా ఇది ప్రయోగంలో ఉంది. మూతి, పెదవులు ఇవన్నీ ముఖయంత్ర భాగాలు. మాట బయటకు
రావటానికి ఇవి స్థానాలుగా ఉంటాయి. బిగించి ఉండటమంటే కదలిక లేకుండా ఉండటం అని అర్థం. మూతిబిగించి ఉండటం అనే ఈ
జాతీయానికి ఇలా మాట్లాడకుండా ఉండటం అనే అర్థం వచ్చింది. ‘ఎంత మంది ఎన్నిసార్లు అడిగినా… మూతిబిగించి కూర్చున్నాడేతప్ప ఏమీ
చేయలేదు’ అనేలాంటి సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది.


చెవిటికి పట్టిన శంఖం

దీన్నే ‘చెవిటివాడి ముందు శంకం వూదినట్టు’ అని కూడా అంటుంటారు. ప్రయోజనం లేని పని అనేది దీనికున్న అర్ధం. వినికిడి శక్తి ఉన్న వాడైతే శంఖం వూదినప్పుడు వచ్చే నాదాన్ని విని ఆనందించటం జరుగుతుంది. వినికిడి శక్తి అస్సలు లేనివాడి ముందు శంఖం వూదితే అతడికి వినిపించేది లేదూ, ఆనందించేదీ లేదు. ఈ భావమే ఈ జాతీయం ఆవిర్భావానికి మూలం. ‘పడుతున్న కష్టాలన్నీ అతడికి చెప్పాను. చెవిటికి
పట్టిన శంఖాలా అయింది అంతే’ లాంటి ప్రయోగాలు తరచూ విన్పిస్తుంటాయి.


పచ్చిపుండు

దేహానికి సంబంధించిన కొన్ని రుగ్మతలు, వ్యాధులు కూడా జాతీయలుగా అవతరించాయి. అవి కలిగించేటంతటి బాధను ఏ పరిస్థితుల్లోనైనా
కలిగిస్తున్నప్పుడు ఈ జాతీయాలు ప్రయోగంలో కనిపిస్తాయి. పచ్చిపుండు అనే ఈ జాతీయం ఆరని సంక్షోభం అనే అర్థంలో ప్రయోగంలో ఉంది.
దేహం మీద పుండుపడి మానకుండా అలాగే ఉంటే ఎంత అసహ్యమూ అశాంతి, బాధ కలుగుతాయో సంక్షోభం కూడా సద్దుమణగకపోతే
చూసేవారికి అలాగే ఉంటుంది. ‘ఉగ్రవాదం దేశమంతటా పచ్చిపుండులా సలుపుతోంది’ లాంటి ప్రయోగాలున్నాయి.


ఉచ్చులోకి లాగటం

ష్టాలపాలు చేయటం అనే అర్ధంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. ఉచ్చు అంటే ప్రాణాంతక పరిస్థితే. ప్రాణం తీయటానికి ఉచ్చును పక్షులకు వేటగాళ్ళు వాడుతుంటారు. మహా నేరస్థులను శిక్షించటానికి ఈ తరహా శిక్ష అమలు జరుగుతుంటుంది. ఇలాంటి భావాలను ప్రతిబింబిస్తూ ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. ‘మోసం చేసి ఉచ్చులోకి లాగాలని చూశారు. కానీ తప్పించుకున్నాను’ లాంటి ప్రయోగాలున్నాయి.


పండుటాకులు

వృద్ధులు అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. చెట్టు చిగురించి, ఆకులొచ్చి, ఆ ఆకులు పండుబారి పోవటాన్ని మానవ జీవన
పరిణామంతో పోల్చిచెప్పినందువల్లే ఈ జాతీయం అవతరించింది. పండిన ఆకు రాలటానికి సిద్ధంగా ఉంటుంది. అలాగే వయోవృద్ధుల జీవితాలు
కూడా అంతం కావటానికి సిద్ధంగా ఉన్నట్టు కనిపిస్తాయి. ‘పండుటాకుల్లా ఉన్నారు ఆ ఇద్దరూ. ఇంకా ఎన్నాళ్ళో…’ అని అనేలాంటి సందర్భాలలో
ఈ జాతీయం ప్రయోగం కనిపిస్తుంది.


కాళ్లూ చేతులు ఆడక పోవడం

మీ తోచక పోవడం, చేష్టలు ఉడగడం లాంటి అర్థాలలో ఈ జాతీయం వాడుకలో ఉంది. ఒక్కొక్కసారి ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డప్పుడు, అనుకున్నది జరగనప్పుడు, ఒకటనుకుంటే మరొకటి జరిగినప్పుడు లేదా మనసుకు మరీ బాధ కలిగినప్పుడు ఏమీ చేయాలో తోచక చేష్టలుడిగి కూర్చుండి పోతుంటారు. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడైతే హాయిగా అటూ ఇటూ తిరగడం సహజం. అందుకు భిన్నంగా జరిగినప్పుడు ఈ జాతీయం వాడుకలో కనిపిస్తుంది. ‘వాడికి ప్రమాదం జరిగిందని వినగానే నాకు కాళ్ళూ చేతులు ఆడలేదు సుమా’ లాంటి ప్రయోగాలు ఉన్నాయి.


బలబల

దొక అనుకరణ శబ్దం. కూలటం, రాలటం, తెల్లవారటం అనేవాటిని సూచించటానికి జాతీయంగా దీన్ని వాడుతుంటారు. చెట్లకాయలు బలబలా రాలాయి. పైకప్పు బలబలా కూలింది. బలబలా తెల్లవారింది అని అంటూ ఉంటారు. కాయలు వేగంగా రాలటం, కప్పువేగంగా కూలటం, తొందరగా తెల్లవారటం అనేవి దీనికి అర్ధాలుగా చెప్పటం కనిపిస్తుంది.


కడుపు పెంచటం

ధికంగా తినటం అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. శ్రమించకుండా సోమరితనంతో ఉంటూ తిండి మీదే ధ్యాసతో ఉండే వారిని
కోపగించుకొనే సందర్భాలలో ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది. కొంతమంది ఎంత అత్యవసరంగా చేయాల్సిన పనులున్నా వాటిని
పక్కనపెట్టి తింటూ కూర్చుంటారు. అలాంటప్పుడు ‘కడుపు పెంచటం తప్ప మరో పన్లేనట్టు అలా తింటూ కూర్చొంటావే. త్వరగా వెళ్ళి చెప్పిన
పనిచేసిరా’ అనేలాంటి సందర్భాలలో ఈ జాతీయం ప్రయోగం విన్పిస్తుంది.


తృణీకరించడం

క్కువగా చేసి మాట్లాడడం అనే అర్థంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. తృణం అంటే గడ్డిపోచ అని అర్థం. గడ్డిపోచను విలువలేనిదిగా అంతా పరిగణిస్తారు. గడ్డిపోచలాగా విలువ లేనివారు అని ఎవరినైనా భావించినప్పుడు ఈ జాతీయం వాడడం కనిపిస్తుంది. ‘ఎదుటి వారి
గొప్పతనం తెలుసుకోకుండా అలా తృణీకరించి మాట్లాడడం మంచిదికాదు’ లాంటి ప్రయోగాలున్నాయి.


తొడిమ వీడడం

రణించడం అనే అర్ధంలో ఈ జాతీయం వాడుకలో కనిపిస్తుంది. కాయ చెట్టుకు వేలాడేటప్పుడు దాని తొడిమ ఆధారంగా ఉంటుంది. ఏ కారణం చేతనైనా చెట్టు నుంచి కాయ విడిపోవాలంటే తొడిమను వీడాల్సిందే. ఈ భావన ఆధారంగా ఈ లోకంతో సంబంధం లేకుండా పోయిన వ్యక్తిని అంటే మరణించిన వ్యక్తిని గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ‘నిన్నరాత్రి తొడిమ వీడింది. ఇక ఆయన లేరు’ లాంటి ప్రయోగాలు విన్పిస్తుంటాయి.


సన్నాయి మోగడం

శుభ కార్యం జరగడం అనే అర్థంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. సంప్రదాయరీతిలో వివాహాది శుభకార్యాలు జరిగేటప్పుడు మంగళ వాద్యంగా

సన్నాయిని మోగిస్తూ ఉండడం జరుగుతుంది. ఈ కారణం చేతనే ఈ జాతీయం వాడుకలోకి వచ్చింది. ‘అయితే రేపు వేసవిలో మీ ఇంట సన్నాయి

మోగుతుందన్న మాట’ లాంటి ప్రయోగాలున్నాయి.


గోడను గుద్దినట్టు

వ్యర్థ, ప్రమాదకర ప్రయత్నం అనే అర్ధంలో ఈ జాతీయ ప్రయోగంలో ఉంది. యుద్ధ విద్యలు వచ్చిన వారి మాట కాదు కానీ సామాన్యుడెవడైనా కోపం వచ్చినప్పుడు చేత్తో ఎదురుగా ఉన్న గోడను గుద్దితే చెయ్యి నొప్పి పుట్టడం తప్ప మరేమీ జరగదు. అలాగే సామాజికంగా, ఆర్థికంగా బలహీనంగా ఉన్నవారు తమకంటే బలవంతులను పరిస్థితులు కలిసిరానప్పుడు ఎదుర్కొని ఇబ్బందులపాలైన సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది. ‘వాడొట్టి మూర్ఖుడు. వాడితో గొడవ పడొద్దంటే వినలేదు. ఇప్పుడు చూడు… పరిస్థితి గోడను గుద్దినట్లు అయింది’ లాంటి ప్రయోగాలున్నాయి.


బెల్లమేయక బూరెలు చేసినట్టు

ది తెలంగాణా గ్రామీణ ప్రాంతంలో వినిపించే జాతీయం. ఇతర మండలాల్లో ఇది ‘అరచేతిలో వైకుంఠం చూపినట్టు’ అనే రూపంలో
వినిపిస్తుంది. అంటే ఏమీ లేకపోయినా అంతా ఉన్నది అని ధ్వనింపచేసేలా ప్రవర్తించే తీరు అన్నది దీనికి అర్థం. ‘వాడు చెప్పినవి ఏవీ
జరగలేదు. బెల్లమేయక బూరెలు చేసిన తీరులో ఉన్నట్టాయే’ లాంటి ప్రయోగాలున్నాయి.


దారి తప్పి దోవలో పడడం

ప్పు తెలుసుకుని మంచిగా మారడం అనే అర్ధంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. ఈ జాతీయంలో కనిపించే దారి అనే పదానికి, దోవ అనే పదానికీ ఒకటే అర్ధం. దారి తప్పడం అంటే మంచిని విడిచిపెట్టి చెడుగా మసలడం అని, దోవలో పడడం అంటే చెడు పద్ధతిని వీడి మళ్ళీ మంచివైపు పోవడమనేది ఇక్కడున్న అర్ధం. అంటే ఎవరైనా సావాసదోషం వల్లనో, మరే కారణం చేతనో చెడు ప్రవర్తనతో ఉన్నప్పుడు తెలిసిన వారెవరైనా అతడి బుద్ధిని మార్చి మంచివైపు పోయేలా చేసినప్పుడు ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది. ‘మావాడు ఇప్పుడిప్పుడే దారి తప్పి దోవలో పడ్డాడు. అంతా ఆ స్వామి ఉపదేశ ప్రభావమే’ లాంటి ప్రయోగాలున్నాయి.


గుంపు కట్టటం

మూహంగా ఏర్పడటం అనే అర్ధంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. పది, పదిహేను మంది ఒకచోట ఉన్నప్పుడు గుంపుగా ఉన్నారని అంటూ ఉంటారు. ఇలా గుంపుగా ఉండి ఏదో ఒక విషయాన్ని గురించి తీవ్రంగా చర్చిస్తూ ఉన్న సమయంలో ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది. ‘రాత్రి దొంగతనం జరిగింది కదా! దాన్ని గురించే గుంపుకట్టి వాళ్ళంతా అలా ఉన్నారు’ లాంటి ప్రయోగాలున్నాయి.


పళ్లు నూరడం

సితో ఉండడం అనేది దీనికున్న అర్ధం. మనిషిలో పగ, కసి, ద్వేషం లాంటివి ఉన్నప్పుడు సర్వసాధారణంగా కలిగే దైహికమైన చర్యను అనుసరించి ఈ జాతీయం ఏర్పడింది. ఇదే పళ్లు కొరకడం, పళ్లు పటపటలాడించడం లాంటి రూపాల్లో కూడా వాడుకలో ఉంది. ‘అంతర్గత కలహాల వల్ల ఆ నాయకుడి మీద అసంతృప్తితో అక్కడున్న వారంతా పళ్లు నూరుతున్నారు’ లాంటి ప్రయోగాలు ఉన్నాయి.


కన్ను మూసి తెరిచేలోగా

స్వల్ప వ్యవధి అనే అర్ధంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. మనకు తెలియకుండానే కనురెప్ప వాలి మళ్ళీ పైకి లేస్తూ ఉంటుంది. అలా జరగడానికి పట్టే సమయం చాలా స్వల్పం. దాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ జాతీయం ఏర్పడింది. ‘కన్నుమూసి తెరిచేంతలోగానే ఇదంతా జరిగిపోయింది’ అనేలాంటి ప్రయోగాలున్నాయి.


ఇంటోడు దొంగల్ల కలిసినట్లు

మ్మక ద్రోహం అనే అర్ధంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. కుటుంబంలోని వ్యక్తి దొంగలతో కలిస్తే దొంగలు సునాయాసంగా ఇంట్లోని సొమ్మును దొంగలించగలుగుతారు. ఇలాగే నమ్మకమున్న వ్యక్తి మనస్పర్ధల కారణంగా పగ సాధించడం కోసం శత్రువులతో కలిస్తే నమ్మినవారిని నష్టపరచడం సులభం. ఇలా నమ్మకద్రోహం అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ జాతీయాన్ని ప్రయోగించడం కనిపిస్తుంది. ‘మంచోడు కదా అని బాధ్యతలు అప్పగిస్తే ఇంటోడు దొంగల్ల కలిసినట్లు పార్టీ అంతటికీ ద్రోహం చేశాడు’ అనేలాంటి ప్రయోగాలున్నాయి. ఈ జాతీయం తెలంగాణా ప్రాంతంలో ఇలా వినిపిస్తుంటే, కోస్తా తదితర ప్రాంతాల్లో ఇంటి దొంగ, ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు లాంటి జాతీయాలు, సామెతల రూపాలు ఇదే అర్ధంలో ప్రచారంలో ఉన్నాయి.


బుర్ర వూపటం

రేననటం, అంగీకరించటం అనే అర్ధాలలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. ఎదుటివారు ఏదైనా చెప్పినప్పుడు, చెయ్యమన్నప్పుడు ఇష్టమని అనిపిస్తే సానుకూల అభిప్రాయాన్ని వ్యక్తపరిచేందుకు తల ఊపటం జరుగుతుంది. దేహ సంబంధమైన ఈ ప్రక్రియను దృష్టిలో ఉంచుకొని ఈ జాతీయం అవతరించింది. ‘ఇన్నాళ్ళకు ప్రతిపక్షాల మాట విని ఆ పథకానికి ముఖ్యమంత్రి బుర్ర ఊపటం శుభసూచక మనిపిస్తోంది’ లాంటి ప్రయోగాలున్నాయి.


చాటలో వెలగకాయ

చాలా స్పష్టంగా అనే అర్ధంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. చాటలో వెంగకాయను ఉంచినపుపడు దాని కోసం ప్రత్యేకంగా దృష్టి సారించి వెతకాల్సిన పని లేదు. ఒక్కసారి అలా చూసినా అది స్పష్టంగానే కనిపిస్తుంది. అదే తీరులో ఏ విషయమైనా చాలా సుస్పష్టంగా ఉంది అని చెప్పాల్సిన సందర్భాలలో ఈ జాతీయాన్ని ప్రయోగిస్తుంటారు. ‘చాటలో వెలగకాయ మాదిరిగా ఉంది ఈ విషయం. దీని గురించి ఇక వివాదం అనవసరం’ లాంటి ప్రయోగాలు ఉన్నాయి.


పొయ్యి ముట్టడం

వంట చేయడం అనే అర్ధంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. వంట చేయడానికి పొయ్యి దగ్గరకు వెళ్లడం, రాజేయడం, దాని మీద వంట వండడం అనేవి సర్వసాధారణ క్రియలు. వంట చేసేటప్పుడు పొయ్యిని ముట్టుకొంటారు. ఈ కారణంగా ఇది జాతీయమైంది. ‘ఒంట్లో బాగోలేని కారణంగా ఇవ్వాల పొయ్యి ముట్టలేదు’.. లాంటి ప్రయోగాలు ఉన్నాయి.


కొయ్య గుర్రం

పురోగతి సాధించలేనిది అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. పిల్లలు ఆడుకోవడానికి వీలుగా కొయ్య గుర్రం ఉంటుంది. అది రూపానికి మాత్రమే గుర్రంలాగా ఉంటుంది. దానిమీదకు ఎక్కిపిల్లలు ఆట కోసం మామూలు గుర్రంలాగా అది వేగంగా ముందుకు పోవటం అనేది సంభవం కాదు. ఈ తీరులోనే కొన్నికొన్ని అభివృద్ధి చెందుతున్నట్టు అనిపిస్తాయి. అవి కొయ్యగుర్రం మీద పిల్లలు అక్కడక్కడే ఊగిన చందంగా ఉంటాయి. అందుకే పురోగతి చెందని సందర్భాలలో ‘ఈ ప్రభుత్వం తీరు కొయ్య గుర్రం నడకలాగే ఉంది’ అని అనడం విన్పిస్తుంది.


ఎత్తుపీట

ప్రముఖ స్థానం అనే అర్ధంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. అగ్రాసనం అనే మాటకు ఇది సమానార్ధకం. ఒక వ్యక్తికి అందరికన్నా ఎక్కువ
ప్రాముఖ్యాన్ని కల్పించిన సందర్భంలో ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది. ‘ప్రతిపక్షంలోకి వెళ్ళగానే అక్కడి వారంతా ఆ నాయకుడికి
ఎత్తుపీట వేసి గౌరవించడం అతడి గొప్పతనానికి గుర్తు’ లాంటి ప్రయోగాలున్నాయి. 

వ్యాఖ్యలు»

1. ramesh - ఆగష్టు 10, 2007

తెలంగాణా తెలుగు పై మీరు వ్రాసిన ఆర్టికల్ చాలా బావుంది. మీరు తెలుగు లో వ్రాయడానిక http://www.quillpad.in/teluguి వాడుతున్నార?